మెట్రోగా మారిన ఆర్టీసీ బస్సులు. సీట్లు లేపేశారు ఆర్టీసీ బస్సుల్లో కొత్త తరహాలో సీటింగ్

Categories:

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే 18 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. నగరంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉదయం పూట ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లే వారితో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సోమ, బుధవారాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. బస్సుల్లో సీట్లకోసం తగాదాలు అవుతున్నాయి. కూర్చుందామంటే సీట్లు దొరకడం లేదు. దీంతో బస్సుల్లో ఎక్కువ సీట్లు లేకుంటే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని భావించిన టీఎస్ ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి, మెట్రో రైలులో మాదిరిగా ఇరువైపులా సీటింగ్ ఏర్పాటు చేసే ఆలోచన చేసింది. దీంతో బస్సు మధ్యలో ఎక్కువ స్థలం ఏర్పడి మరింత మందికి సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
ఈ మేరకు కొన్ని బస్సుల్లో సీట్లు తీసి ప్రయోగాత్మకంగా తీసుకొచ్చారు. ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్‌లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సిటీ బస్సుల్లో 44 సీట్లు ఉండి 63 మంది ప్రయాణికులను చేరవేస్తే 100శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ పరిగణిస్తుంది. మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందిగా మారడంతో కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. మరి ఆర్టీసీ మెట్రో తరహా బస్సుల ఈ కొత్త విధానం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
హైదరాబాద్ లోని బస్సుల్లో ప్రస్తుతానికి 44 సీట్లు ఉన్నాయి. 63 మంది ప్రయాణిస్తే వంద శాతం ఆక్యుపెన్సీగా ఆర్టీసీ చెబుతోంది. ఇపుడు ఇందులో ఆరు సీట్లు తొలగిస్తున్నారు. బస్సుకు ఇరు వైపుల మెట్రో మాదిరి 5 సీట్ల చొప్పును ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గతంలో పోలిస్తే రెండు సీట్లు తగ్గుతున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *