ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నో రామోజీరావు గారి గురించి అనేక ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వస్తున్నాయి. తాజాగా ఆయన మరణానికి ముందే సమాధి ఎక్కడ నిర్మించాలో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న విషయం బయిటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే…
మూడురోజుల క్రితం రామోజీ రావు కు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.
రామోజీరావు పేరు జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయిందంటే ఆయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించిన ఆయన సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా దేశంలో అత్యద్భుతంగా రామోజీ ఫిలిమ్ సిటినీ నిర్మించారు. అక్కడే ఆయన సమాధికి ఏర్పాటు చేయమన్నట్లు తెలిసింది.