ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!

| | 0 Comments| 10:41 am
Categories:

తెలంగాణలో అధికారం మారిన అన్ని వ్యవస్థలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎక్సైజ్‌ శాఖకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

తెలంగాణలో కూడా ఏపీ బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయని ప్రచారం జరగడం కలకలం రేపింది. ప్రెసిడెంట్‌ మెడల్‌, స్పెషల్‌ స్టేటస్‌ వంటి బ్రాండ్లు వస్తున్నాయని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలకు విస్తృత ప్రచారం జరగడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త బ్రాండ్లు ఏవీ రావడం లేదని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది.

కొత్త బ్రాండ్లపై వస్తున్న ఆరోపణలపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామని జరుగుతున్న ప్రచారం తప్పు. అది దుష్ప్రచారం’ అని కొట్టిపారేశారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని.. అసలు పరిశీలన జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు, లెక్కలు తదితర వాటిపై జూపల్లి వివరణ ఇచ్చారు.

నాడు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌ పెట్టి వెళ్లిందని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రైతు భరోసాకు సంబంధించి రూ.6 వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వం చేసిందని తెలిపారు. ఈనెలలోనే రూ.370 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మద్యం కొరతపై స్పందిస్తూ.. ‘మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టం. ప్రజలకు కాదు. బ్లాక్‌లో మద్యం విక్రయించిన ఘటనలపై ఎక్సైజ్‌ శాఖ కేసులు నమోదు చేసింది. తయారీ యూనిట్ల వద్ద అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలన చేస్తున్నారు’ అని కృష్ణారావు వివరణ ఇచ్చారు. తప్పుడు రాతలు రాసిన పత్రికపై తాము పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఎక్సైజ్‌ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *