మ్యాచో స్టార్ గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్లు చేసిన ప్రతిసారి ఆయనకు మంచి పేరు, విజయాలు వచ్చాయి.
ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాల్లో పోలీసుగా నటించారు. ‘భీమా’తో మరోసారి పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ఉందని గోపీచంద్ చెప్పారు. ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది? గోపీచంద్ ఎలా చేశారు? హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఎలా నటించారు? కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ : మహేంద్రగిరిలో భవాని (ముఖేష్ తివారి)కి తిరుగులేదు. ఆయనకు ఎదురు తిరిగితే పోలీస్ అధికారుల్ని అయినా సరే చంపేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. ఆ తర్వాత భీమా (గోపీచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతో భవానీకి వార్నింగ్ ఇస్తాడు. భవాని మనుషుల్ని టార్గెట్ చేస్తాడు. ఆఖరికి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల దగ్గరకు వస్తాడు. భవాని ట్యాంకర్లలో రహస్యం ఏమిటి? పకృతి వైద్యుడు రవీంద్ర వర్మ (నాజర్) ఏం చేశాడు? విద్య (మాళవికా శర్మ) వల్ల భీమా జీవితంలో ఏం జరిగింది? రామా (గోపీచంద్), పారిజాతం (ప్రియా భవానీ శంకర్) ఎవరు? భీమా మీద విజయం కోసం భవాని తన బలం, బలగాన్ని మహేంద్రగిరిలో దించడంతో ఏం జరిగింది? వీళ్లకు, మహేంద్రగిరిలోని పరశురామ క్షేత్రంలో ఐదు దశాబ్దాలుగా మూత పడిన శివాలయానికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: గోపీచంద్ చెప్పినట్లు ఇంతకు ముందు ఆయన నటించిన పోలీస్ సినిమాలకు, ‘భీమా’కు చాలా డిఫరెన్స్ ఉంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్ కథను కొత్తగా చూపించింది. అయితే. హీరో ఇంట్రడక్షన్ మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రాలను తలపించిందీ ‘భీమా’.
భీమా’ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు పదిహేను నిమిషాల వరకు హీరోను చూపించలేదు. పరశురామ క్షేత్రం, ఆ శివాలయంలో జరిగే పూజల గురించి వివరించారు. అప్పుడు ఏదో తెలియని ఆసక్తి కలుగుతుంది. హీరో పరిచయమైన తర్వాత ఆసక్తి నెమ్మదిగా తగ్గుతుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ వరకు మళ్లీ గుడి ప్రస్తావన ఉండదు.
హీరో పరిచయం తర్వాత ‘భీమా’ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మారింది. భీమా, విద్య లవ్ ట్రాక్ బాలేదు. మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్లు ఉన్నారు. రామా, పారి లవ్ ట్రాక్ కూడా కొత్తగా లేదు. సోషియో ఫాంటసీ పాయింట్ తీసుకుని రాసిన కొత్త కథను ఆ రెండు లవ్ ట్రాక్స్ సాదాసీదాగా మార్చాయి. ప్రేమ కథలు, కామెడీ సీన్లు బాగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
రవి బస్రూర్ పాటల కంటే నేపథ్య సంగీతం ‘భీమా’ చిత్రానికి బలంగా నిలిచింది. యాక్షన్ సీన్లకు చేసిన రీ రికార్డింగ్ బావుంది. గోపీచంద్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ మాస్ సినిమాకు కావాల్సిన మూడ్ స్క్రీన్ మీద చూపించింది. నిర్మాత కెకె రాధామోహన్ ఖర్చుకు వెనకాడలేదు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. ఫస్టాఫ్లో అనవసరమైన సన్నివేశాల విషయంలో ఎడిటింగ్ పరంగా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు.
గోపీచంద్ లుక్స్ గురించి మాట్లాడాలి. ఆయన రెండు లుక్స్లో కనిపించారు. ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేస్తే హ్యాండ్సమ్గా, స్లిమ్గా ఉన్నారు. హుషారుగా కనిపించారు. ఎనర్జీ చూపించారు. భీమాగా పోలీస్ పాత్రలో మీసకట్టు, రామాగా పొడవాటి జుట్టుతో డిఫరెన్స్ చూపించారు. నటనలో ఎప్పటిలా 100 పర్సెంట్ ఇచ్చారు. హీరోయిన్లలో మాళవికా శర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మాస్ ఆడియన్స్ కోసం అన్నట్లు ఆమెను గ్లామరస్గా కనిపించారు. పతాక సన్నివేశాల్లో ప్రియా భవానీ శంకర్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.
‘భీమా’ను హీరో సెంటిక్ సినిమా అని చెప్పలేం. కానీ, కథంతా ఎక్కువ హీరో చుట్టూ నడుస్తుంది. మిగతా పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంది. అయితే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ల తరహాలో ఉంటాయి. ముఖేష్ తివారి కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించారు. ‘బాహుబలి’లో బిజ్జలదేవ టైపులో బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేశారు. రవీంద్ర వర్మగా పాత్రకు తగ్గట్టు నాజర్ నటించారు. రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్, సీనియర్ నరేష్, సప్తగిరి, ‘చమ్మక్’ చంద్ర, సరయు. భద్రం సహా కొందరు కమెడియన్లు ఉన్నారు. సీనియర్ నరేష్ మినహా మిగతా వాళ్లకు సరైన కామెడీ సీన్లు పడలేదు.
‘భీమా’లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అందులో నావెల్టీ ఉంది. సినిమా ప్రారంభం, ముగింపు బాగా రాసుకున్నారు. మధ్యలో సో సో సీన్లతో నింపేశారు. గోపీచంద్ చాలా వరకు సినిమాను నిలబెట్టారు. ఆయన ఎనర్జీ, నటన అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. చివరి 30 నిమిషాల్లో అసలు కథ ఉంది. అదొక కొత్త అనుభూతి ఇస్తుంది. ఆ అరగంట ఆయువుపట్టుగా నిలిచింది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే గోపీచంద్ నటన, క్లైమాక్స్, యాక్షన్ సీన్లు నచ్చుతాయి. మాస్ ఆడియన్స్ను మెప్పించే చిత్రమిది.
భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ – సినిమా హిట్టా? ఫట్టా?
Categories: