అట్టహాసంగా ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సోమవారం తెగిపోయింది. ఒక ముక్క విడిపోయి సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది.
ఆ సయమంలో సందర్శకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్‌కేబీచ్‌లో ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తదితరులు ఆ బ్రిడ్జిని ప్రారంభించారు. అలలు ఎక్కువగా ఉండే విశాఖ సముద్ర తీరంలో ఏర్పాటు చేయడం తగదని, ప్రమాదాలు జరుగుతాయని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వినకుండా జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, జీవీఎంసీ కమీషనర్ సాయికాంత్ వర్మ పట్టుపట్టి ప్రైవేటు వ్యక్తులతో దీనిని ఏర్పాటు చేయించారు.
జోడుగుళ్ల పాలెం తీరంలో తొలుత ఏర్పాటు చేయాలని భావించగా అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. దీంతో జీవీఎంసీ పరిధిలోకి వచ్చే ఆర్‌కేబీచ్‌లో హడావుడిగా ఏర్పాటు చేశారు. ఒకే పర్యాయం వంద మంది ఈ బ్రిడ్జ్ మీద ఉండే విధంగా అన్ని రకాల భద్రతా చర్యలతో ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రకటించిన 24 గంటలు గడవక ముందే బ్రిడ్జి మీద ఒక్కరు కూడా లేని సమయంలో బ్రిడ్జిలో ఒక ముక్క సముద్రంలో కొట్టుకుపోవడం భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సరైన అధ్యయనం లేకుండా, సంబంధిత శాఖల నిపుణుల అనుమతులు నివేదికలు తీసుకోకుండా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ బ్రిడ్జ్ తెలియజేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.