అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. ఆ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశం మొత్తం దీపావళి పండుగ వాతావరణం నెలకొననుంది.
అనేకమంది ప్రముఖులు అయోధ్యలో చారిత్రాత్మక రామమందిర నిర్మాణంలో తమ వంతుగా, ఉడతా భక్తిగా విరాళాలు అందించారు. బాలీవుడ్ దిగ్గజాలైన అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమ మాలిని మొదలుకొని, ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకు విరాళాలు ఇచ్చారు. వారు ఇచ్చిన విరాళాల గురించి తెలుసుకుందాం.
1. అక్షయ్ కుమార్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం జనవరి 17న కొంత విరాళంగా ఇచ్చానని చెప్పారు.. కానీ ఎంత ఇచ్చారో వెల్లడించలేదు. “అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం… ఇప్పుడు సహకరించడం మన వంతు. నేను ప్రారంభించాను, మీరు కూడా మాతో చేరుతారని ఆశిస్తున్నాను… జై శ్రీరామ్” అని ఆ సమయంలో చెప్పారు.
2. అనుపమ్ ఖేర్: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రామమందిర నిర్మాణానికి ఇటుకలను విరాళంగా ఇచ్చారు.
3. హేమ మాలిని: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, ప్రముఖ భారతీయ నటి హేమ మాలిని కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడమే కాకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చురుకుగా ప్రచారం చేస్తున్నారు.
4: మనోజ్ జోషి: బాలీవుడ్ నటుడు, ప్రముఖ హాస్య చిత్రాల్లాలో నటించి మెప్పించిన మనోజ్ జోషి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తనవంతు సహకరించారు.
5. గుర్మీత్ చౌదరి: టీవీ నటుడు గుర్మీత్ చౌదరి కూడా విరాళం అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపారు.
6. ప్రణిత సుభాష్: కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాలతో అలరించిన నటి ప్రణిత సుభాష్.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారానికి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. “అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ కోసం నేను రూ. 1 లక్ష ఇచ్చాను. మీరందరూ చేతులు కలపాలని, ఈ చారిత్రాత్మక ఉద్యమంలో భాగం కావాలని అభ్యర్థిస్తున్నాను” అని చెప్పారు.
7. గౌతమ్ గంభీర్
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. “మహిమగల రామ మందిరం భారతీయులందరి కల. ఎట్టకేలకు, ఈ దీర్ఘకాల సమస్యకు తెరపడింది. ఇది ఐక్యత, ప్రశాంతతకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రయత్నంలో నేను, నా కుటుంబం చిన్నపాటి సాయం చేస్తున్నాం” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
8. ముఖేష్ ఖన్నా: శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా రామ మందిర నిర్మాణం కోసం 1.11 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అదే విషయాన్ని వెల్లడిస్తూ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ట్వీట్ చేశారు.
9. మనీష్ ముంద్రా: ఆంఖోన్ దేఖి, మసాన్, కద్వి హవా వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను అందించిన నిర్మాత మనీష్ ముంద్రా.. రామ మందిర నిర్మాణానికి రూ. 1 కోటి విరాళంగా ఇచ్చారు. ఇంతకుముందు కరోనా మహమ్మారి సమయంలోనూ వెంటిలేటర్ల కోసం రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చారు.
10. పవన్ కల్యాణ్: రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో ఒకరైన పవన్ కల్యాణ్ ఆ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు.
అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?
Categories: