AP వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు రెండేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన కూడా చేశారు.
అంతే కాదు టీడీపీ, బీజేపీల్ని ఏకం చేసి జనసేనతో కలిపి ఎన్నికలకు వెళ్లేందుకు పవన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చల సారాంశంగా పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ కోరినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వడం లేదని, అందుకే పవన్ .. రేపు జరిగే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు తొలుత రానన్నారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు చంద్రబాబు హైదరాబాద్ లో పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో ఆయన అంగీకరించారు. అలాగే పవన్ పార్టీ జనసేనకు టీడీపీ 25 నుంచి 28 సీట్ల వరకూ ఇవ్వొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కు సన్నిహితుడైన కాపు నేత హరిరామజోగయ్య ఇవాళ సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రంలో జనసేన పాతిక సీట్లకు పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకున్న సమాచారం మేరకు జనసేన పార్టీ రాష్ట్రంలోని 57 సీట్లలో పోటీ చేసేందుకు పరిశీలిస్తోందని జోగయ్య స్పష్టం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కోసం ఆరు సీట్లను పరిశీలిస్తున్నట్లు కూడా జోగయ్య వెల్లడించారు.
అంతే కాదు ఆ 57 సీట్లతో పాటు పవన్ కోసం చూస్తున్న ఆరు సీట్ల వివరాలను కూడా వెల్లడించారు. దీంతో జోగయ్య ప్రకటన సంచలనం రేపుతోంది.
రాష్ట్రంలో జనసేన పోటీ కోసం పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, భీమిలి, గాజువాక, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, నిడదవోలు, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, నూజివీడు, పెడన, తెనాలి, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పొన్నూరు, గిద్దలూరు, ఒంగోలు, దర్శి, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, అనంతపురం, గుంతకల్లు, పుట్టపర్తి, నంద్యాల, కడప, కావలి, కోవూరు ఉన్నాయి.
అలాగే పవన్ కళ్యాణ్ పోటీ కోసం పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, నరసాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గాజువాక సీట్లు ఉన్నాయి. అటు నాగబాబు పోటీ కోసం పరిశీలిస్తున్న సీట్ల జాబితాలో తిరుపతి సీటు ఉంది. అలాగే మిగిలిన సీట్లలోనూ పోటీ కోసం పరిశీలిస్తున్న నేతల వివరాలను జోగయ్య ప్రకటనలో తెలిపారు.