ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు.
ప్రతీ ఇంటికి వెళ్లి ఫిజికల్‌గా ఓటర్ స్లిప్పులను అందించడానికి బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO)కు బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిపారు. కానీ చాలా మంది కి ఓటర్ స్లిప్పులు అందలేదనే ఫిర్యాదు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత BLO మొబైల్ నెంబర్ తెలిస్తే ఫోన్ చేసి వారి నుంచి పొందే అవకాశమున్నది.
అందకపోతే ఏం చేయాలి?
ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ SMS ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అదే పోలింగ్ కేంద్రంలో పేరు ఉన్నట్లయితే గుర్తింపు కార్డును చూపి ఓటేయవచ్చు. లేదంటే ఈ పద్ధతుల్లో ఓటర్ స్లిప్‌ను లేదా వివరాలను పొందే వెసులుబాటు ఉన్నది.
ఒక్క మెసేజ్‌తో..
ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు SMS పంపితే వివరాలు వస్తాయి.
ఆన్‌లైన్‌లో అయితే..
www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ యువర్ నేమ్-అసెంబ్లీ-ఓటర్స్ సర్వీస్ పోర్టల్ మెనూ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో. వివరాలు తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. www.electoralsearch.eci.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఇవే వివరాలను పొందుపర్చి ఓటర్ డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇలా కూడా పొందచ్చు
www.voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌ను సెలెక్టు చేసి వ్యక్తుల వివరాలను పొందుపర్చడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో ఆఫీసర్స్ డీటెయిల్స్ – బూత్ లెవల్ ఆఫీసర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా జిల్లా, నియోజకవర్గం, అక్కడి పోలింగ్ కేంద్రాల వారీగా BLO ల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వారికి ఫోన్ చేసి బూత్ నెంబర్ వివరాలను పొందొచ్చు. లేదా www.ceotserms2.telangana.gov.in./TS_ERODETAILS/BLO_Details.aspx అనే వెబ్‌సైట్ ద్వారా జిల్లా, నియోజకవర్గం వివరాలను పొందుపర్చి BLO ల ఫోన్ నెంబర్లను తెలుసుకోవచ్చు.
టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా..
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 24 గంటలూ పని చేసే హెల్ప్ లైన్ (టోల్-ఫ్రీ) నెంబర్ 1950కి ఫోన్ చేసి ఓటర్ల వివరాలను లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను తెలియ జేయడం ద్వారా కూడా పోలింగ్ కేంద్రం, బూత్, నెంబర్ తదితరాలను పొందవచ్చు.
మెయిల్ ద్వారా..
ఎన్నికల సంఘానికి మెయిల్ (complaints@eci.gov.in) ద్వారా కూడా మన గ్రీవెన్స్ (ఫిర్యాదు)ను ఇచ్చి పోలింగ్ బూత్ వివరాలను తిరిగి మెయిల్ ద్వారానే పొందవచ్చు.
మొబైల్ యాప్‌తో..
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చు.